Allu Arjun-Pawan Kalyan-Ram Charan | దివంగత నటుడు, హాస్యబ్రహ్మ అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ (94) ఇటీవలే వృద్ధాప్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె దశదిన కర్మను కుటుంబ సభ్యులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, హీరో రామ్ చరణ్, అకీరా నందన్ తదితరులు హాజరయ్యారు. కనకరత్నమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ, ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, హీరో నిఖిల్ సిద్దార్థ్, మంచు లక్ష్మి, నిర్మాత బన్నీ వాసు తదితర సినీ–రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇక పెద్దకర్మ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే చోట కూర్చొని ఉన్న ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొద్ది రోజులుగా మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో తాజా పిక్స్ అన్ని పుకార్లకి చెక్ పెట్టినట్టు అయింది.
అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని అన్నప్పటి నుండి మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ ఉంది. ఇక 2024 ఎలక్షన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయని బన్నీ.. వైసీపీ వ్యక్తి కోసం వేరే ప్రాంతానికి వెళ్లి మరీ ప్రచారం చేశాడు. ఈ నేపథ్యంలో అల్లు వర్సెస్ మెగా అన్నట్టుగా పరిస్థితి మారింది. కాని తాజా సంఘటనలు చూసిన వారు మెగానుబంధం అల్లుకున్నట్టే అని కామెంట్స్ చేస్తున్నారు.