Allu Arjun | టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తుండగా… ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇప్పటికే ట్రైలర్, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా అనస్వర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనస్వర రాజన్… తాను చూసిన తొలి తెలుగు సినిమా బాలకృష్ణ నటించిన ‘శ్రీరామరాజ్యం’ అని చెప్పింది. అయితే ఆ సినిమా తెలుగులో తెరకెక్కిందన్న విషయం అప్పట్లో తనకు తెలియదని వెల్లడించింది. “మా నానమ్మ ఆ సినిమా చూస్తుండగా నేను చూశాను. కానీ అది తెలుగు సినిమా అని అప్పట్లో నాకు అర్థం కాలేదు” అని అనస్వర చెప్పింది.
చిన్నప్పట్లో మలయాళంలో డబ్ అయిన అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువగా చూసేదాన్నని, ఆ సమయంలో అల్లు అర్జున్ తెలుగు హీరో అని తనకు తెలియదని తెలిపింది. “అయన్ను మలయాళ హీరోనే అనుకున్నాను. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘మగధీర’ సినిమా చూసినప్పుడే తెలుగు సినిమాలు, నటుల గురించి స్పష్టంగా తెలిసింది” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు సరదాగా స్పందిస్తుండగా… మరికొందరు మాత్రం అనస్వర నిజాయితీగా తన అనుభవాన్ని చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ‘ఛాంపియన్’ సినిమాతో అనస్వర రాజన్ తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘చంద్రకళ’ పాత్రలో కనిపించనుంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మించాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఇటీవల ట్రైలర్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాతో రోషన్, అనస్వర ఇద్దరికీ మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి.