ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు యాక్టర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్. దీంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోతున్నది. ఈ విజయానందాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు ‘పుష్ప-2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. బుధవారం ఆయన తన అభిమానులకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్నిచ్చారు. తన దినచర్యతో పాటు ‘పుష్ప-2’ మేకింగ్ వీడియోను అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. తన ఇంటి నుంచి మొదలుకొని సెట్ వరకు సాగిన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
‘పుష్ప-2’లోకేషన్లో దర్శకుడు సుకుమార్‌తో బన్నీ మాటామంతీ.. ఆ తర్వాత షూటింగ్లో పాల్గొనడం వరకు ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిని పంచింది. ‘ఇతర దేశాల కంటే మన దగ్గర అభిమానులు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ల ప్రేమకు హద్దులు ఉండవు. వారందరూ గర్వపడేలా నేను నడచుకుంటాను. ‘పుష్ప-2’ నా 20వ చిత్రంగా తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో నాకు అన్నింటికంటే నచ్చిన పాత్ర పుష్పరాజ్ పాత్రే. అతను దేనికీ వెనకడుగు వేయడు’ అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ టీమ్ షూట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ భాగస్వామ్యంతో వీడియో చేసిన తొలి భారతీయ హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.