Allu Arjun | ‘పుష్ప2’ హడావిడి ముగిసిన నాటినుంచి అల్లు అర్జున్ నెక్ట్స్ పనిచేసేది ఏ దర్శకునితో? అనే చర్చ అటు పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో నడుస్తూనే ఉంది. ఈ చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు త్రివిక్రమ్, అట్లీ. నిజానిక్కూడా వీరిద్దరి కథలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు బన్నీ. మరి ముందు ఎవరితో? అనేదే ఇక్కడ చర్చ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముందు అట్లీ సినిమానే ఉంటుందని తెలుస్తున్నది. నిజానికి ‘జవాన్’ పూర్తయిన నాటినుంచి బన్నీ కథపైనే ఉన్నారట అట్లీ. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయ్యిందని, బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉందని సమాచారం. అందుకే త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ని మొదలుపెట్టనున్నారట బన్నీ. అలాగే దర్శకుడు అట్లీకి ఆయన ఓ షరతు కూడా విధించారట. వచ్చే ఏడాది మార్చి కల్లా షూటింగ్ కంప్లీట్ అవ్వాలి అనేదే ఆ షరతు.
పానిండియా సినిమా అంటూ సంవత్సరాల పొడుగునా తీస్తే కుదరని కరాఖండీగా చెప్పేశారట బన్నీ. స్క్రిప్ట్ ఇప్పటికే కంప్లీట్ అవ్వడంతో బన్నీ షరతుకు అట్లీ కూడా ఓకే చెప్పేశారట. ఈ లోపు త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకొని, 2026 మార్చి తర్వాత సెట్స్‌కి వెళ్తుందని ఫిల్మ్ వర్గాల టాక్. ఈ సినిమాకు బన్నీ ఏడాదిన్నర డేట్లు ఇచ్చినట్టు తెలుస్తున్నది. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమా కావడం వల్లే.. బన్నీ ఎక్కువ డేట్లు కేటాయించారన్నది ఇన్సైడ్ టాక్. అయితే.. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు మాత్రం ఇప్పటివరకూ రాలేదు. ఇందులో నిజానిజాలు ఎంతవరకో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.