Allu Aravind | ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరో కూడా అనే విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లోకి రావాలనే ఆసక్తి లేకున్నా తన అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ వల్లనే తాను ఇండస్ట్రీకి రావల్సి వచ్చిందని పవన్ పలు సందర్భాలలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. మా అమ్మ వల్లనే పవన్ కళ్యాణ్ సినిమాలలోకి వచ్చారని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. నిన్న (సెప్టెంబర్ 8) హైదరాబాద్‌లో ఆమెకు సంబంధించిన పెద్ద కర్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హీరో రామ్ చరణ్‌తో పాటు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, తన తల్లి గొప్పతనాన్ని స్మరించుకున్నారు. ఆమె ప్రేమ, అనురాగం, కుటుంబ విలువలు ఎలా ఉన్నాయో కళ్లముందు ఆవిష్కరించారు. తల్లి గురించి మాట్లాడే ప్రతి మాటలోనూ భావోద్వేగం స్పష్టంగా కనిపించింది. అల్లు కనకరత్నం గారి గురించి మాట్లాడుతూనే, పవన్ కళ్యాణ్‌తో ఆమెకు ఉన్న సన్నిహిత సంబంధాన్ని అల్లు అరవింద్ గుర్తు చేశారు. ఆవిడ పవన్‌ని ఎప్పుడూ ‘కల్యాణి’ అని ముద్దుగా పిలిచేవారు.’నువ్వు చక్కగా ఉన్నావ్ కదా, సినిమాల్లోకి ఎందుకు రావు?’ అంటూ ప్రేమగా అడిగేవారు. దానికి పవన్ ‘నాకు ఇబ్బంది, సిగ్గుగా ఉంటుంది’ అని చెప్పేవాడు,” అని ఆ మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నారు అల్లు అరవింద్.
అలాగే నా తల్లి ఎన్నోసార్లు పవన్‌తో ఓ సినిమా చేయమని చెప్పేదని అప్పటి మాటలు కూడా గుర్తు చేశారు అల్లు అరవింద్. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మా తల్లిగారు చాలా గొప్ప జీవితాన్ని గడిపారు. ఆమెకి చిరంజీవి గారు అల్లుడిగా వచ్చారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు మనవళ్లుగా వచ్చారు. ఈ రెండు ఫ్యామిలీల నుండి ఇంకా ఎంతో మంది స్టార్స్ ను కూడా ఆమె చూశారు. మనవలు, మునిమనవలను కూడా ఆమె చూశారు. అందుకే, ఆమెకు ఆనందంగా ముగింపు పలకాలని అనుకున్నాం అంటూ అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.