‘ఈ కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. నిజంగా ఇప్పటివరకూ ఇలాంటి కథ వినలేదు. అద్భుతమైన కంటెంట్. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీలింగ్ ఈ కథలో ఉంది. ఇందులో నా పాత్ర పేరు భూమా. ఇలాంటి పాత్ర చేయడం బాధ్యతగా భావించాను. థియేటర్లకు వెళ్లి సినిమా చూసిన ఆడియన్స్ మంచి ఫీల్‌తో బయటికి రావాలనేది నా ఆశ. ఇది అలాంటి కథే. నా కెరీర్లో సరైన సమయంలో ఎంచుకున్న మంచి ప్రాజెక్ట్ ఇది.’ అని రష్మిక మందన్నా అన్నారు.
ఆమె ప్రధాన పాత్రగా రూపొందిన ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. దీక్షిత్‌శెట్టి మేల్ లీడ్ చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. సమర్పణ అల్లు అరవింద్. నవంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రష్మిక మాట్లాడారు. తాను చదుకుంటున్నరోజుల్లో ఈ ఐడియా వచ్చిందని, కొన్నేళ్ల క్రితం కథగా రాశానని, ఇంటెన్స్ ఎమోషన్‌తో కూడుకున్న ప్రేమకథ ఇదని, అంతా పాషన్‌తో పనిచేశారని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఈ కథను రాహుల్ నాలుగేళ్ల క్రితం చెప్పాడు. ‘ఆహా’కు వెబ్‌సిరీస్‌లా చేయాలనుకున్నాడు. నాకేమో సినిమా చేస్తే బావుంటుందనిపించేది. ఇందులో కథానాయికది టఫ్ రోల్. హెవీ పర్ఫార్మెన్స్ చేయాలి. రష్మిక లాంటి మంచి నటి మాత్రమే ఈ పాత్ర చేయగలదు. అందుకే తీసుకున్నాం. ఈ సినిమాతో ఆమెకు జాతీయ అవార్డు ఖాయం.’ అని నమ్మకంగా చెప్పారు. ఇంకా దీక్షిత్‌శెట్టి, నిర్మాతలు బన్నీవాస్, విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని, డీవోపీ కృష్ణన్ వసంత్, నిర్మాత ఎస్కేఎన్ కూడా మాట్లాడారు.