Allari Naresh | టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తాత, దివంగత ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి అయిన ఈవీవీ వెంకట్రావు (90) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, ఆయన పెద్ద కుమారుడు ఈవీవీ సత్యనారాయణ 2011లోనే మరణించిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి వెంకటరత్నం కూడా 2019లో కన్నుమూశారు. కాగా, వెంకట్రావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు కోరుమామిడిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాత మరణంతో అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేష్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.