‘నేను ఇప్పటివరకు సస్పెన్స్ థ్రిల్లర్ కథ చేయలేదు. అందుకే ఈ సినిమా కెరీర్లో ప్రత్యేకమనుకుంటున్నా. కథలోని పారానార్మల్ ఎలిమెంట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తుంది’ అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నాని కాసరగడ్డ దర్శకత్వంలో రూపొందిన ‘12ఏ రైల్వేకాలనీ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం అల్లరి నరేష్ విలేకరులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
హైదరాబాద్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. 12ఏ అనే పేరున్న ఇంట్లో కథ జరుగుతుంది. స్క్రీన్‌ప్లే ఎవరూ ఊహించని మలుపులతో సాగుతుంది. ఇందులో నా పాత్ర పేరు కార్తీక్. తను స్థానిక ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తుంటాడు. ఓ సంఘటన వల్ల అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగతా కథ.
ఈ చిత్ర షోరన్నర్ అనిల్ విశ్వనాథ్ ఈ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠ పెరిగింది. ఈ సినిమాలో మూడునాలుగు కథలు సమాంతరంగా నడుస్తుంటాయి. వీటిలో మైండ్‌గేమ్ ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేస్తుంది.
ఓ నటుడిగా కామెడీ చేయడమే చాలా కష్టం. అందుకు మంచి టైమింగ్ కుదరాలి. మనం సీరియస్‌గా ఉంటూ ఆడియెన్స్‌ని నవ్వించగలగాలి. ఆ టైమింగ్ బ్యాలన్స్ చేయడం చాలా క్లిష్టమైన వ్యవహారం. నాన్నగారు ఎక్కువగా కామెడీ సినిమాలు చేయడంతో నాకు ఆ జోనర్‌కు సంబంధించిన అనేక విషయాలను నేర్చుకునే అవకాశం దక్కింది.
‘12ఏ రైల్వే కాలనీ’ కథ వరంగల్ నేపథ్యంలో నడుస్తుంది. ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసను మాట్లాడాను. ఎలాంటి దోషాలు ఉండకూడదని వర్క్‌షాప్ ద్వారా తెలంగాణ యాసను బాగా ప్రాక్టీస్ చేశా. డబ్బింగ్లో యాస సరిగ్గా పలికేలా జాగ్రత్త తీసుకున్నా.
ఇప్పటివరకు విభిన్న జోనర్ చిత్రాలు చేశాను. ఇంకా హారర్‌తో పాటు మూకీ సినిమా చేయాలనే కోరిక మిగిలిపోయింది. డైలాగ్ లేకుండా నవ్వించే అలాంటి కథలో ఎప్పటికైనా నటించాలి. అలాగే ఓ కామెడీ వెబ్‌సిరీస్ చేసే ఆలోచన ఉంది. నా తర్వాతి చిత్రాలు రెండూ వినోదప్రధానంగానే ఉంటాయి.. ‘ఆల్కహాల్’ సినిమా జనవరిలో రిలీజ్ అవుతుంది.