‘నాంది’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు అల్లరి నరేష్. మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం, నా సామిరంగ, ఆ ఒక్కటి అడక్కు, బచ్చలమల్లి.. ఇలా రకరకాల ఎమోషన్స్‌తో కూడిన కథల్ని ఎంచుకుంటూ ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారాయన. త్వరలోనే అల్లరి నరేష్ కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నారు. సినిమా పేరు ‘రంభ ఊర్వశి మేనక’.
శర్వానంద్‌తో ‘రాధ’ సినిమాను తెరకెక్కించిన చంద్రమోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. టైటిల్‌ని బట్టి ఇదేదో ముగ్గురు హీరోయిన్లతో కూడిన సోషియో ఫాంటసీ సినిమా అనుకునే అవకాశం ఉంది. కానీ ఇది ఆ తరహా కథ కాదని, చంద్రమోహన్ గమ్మత్తుగా ఆలోచించి రాసుకున్న కథ ఇదని, టైటిల్ మాదిరిగానే కథ కూడా గమ్మత్తుగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం అల్లరి నరేష్ ‘12ఏ – రైల్వే కాలనీ’ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. దీని తర్వాత ‘రంభ ఊర్వశి మేనక’ సెట్లోకి అల్లరి నరేష్ ఎంట్రీ ఇస్తారట. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థ లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.