Allari Naresh | కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా సూటయ్యే ఫుల్ లెంగ్త్ కామెడీ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రంబా ఊర్వశి మేనక’. ఫాంటసీ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. వినూత్నమైన కథాంశంతో పాటు అల్లరి నరేష్ మార్క్ కామెడీని జోడించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
‘రంబా ఊర్వశి మేనక’ కథ మొత్తం ఒక క్రేజీ ఫాంటసీ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఇంద్రలోకానికి చెందిన ముగ్గురు అప్సరసలు రంభ, ఊర్వశి, మేనక అనూహ్యంగా భూమిపైకి వస్తారు. అంతేకాదు.. వారు నేరుగా హీరో ఇంటికే చేరి అక్కడే నివసించడం మొదలుపెడతారు. అల్లరి నరేష్ పోషిస్తున్న సూర్య పాత్ర మొదట వీరి రాకను తన అదృష్టంగా భావిస్తుంది. తన జీవితంలో ఉన్న అన్ని సమస్యలు ఇక తొలగిపోతాయని, తన తలరాత మారిపోతుందని సంతోషపడతాడు. కానీ కొద్దికాలానికే అసలు విషయం తెలిసి హీరో షాక్ అవుతాడు. రంభ, ఊర్వశి, మేనకలకు ఉన్న దివ్యశక్తులను స్వయంగా ఇంద్రుడే తొలగించినట్లు ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాలో ఇంద్రుడి పాత్రను వెన్నెల కిషోర్ పోషిస్తున్నారు. సంప్రదాయంగా ఊహించే ఇంద్రుడి పాత్రకు భిన్నంగా, మోడ్రన్ టచ్‌తో కామెడీ పండించేలా వెన్నెల కిషోర్ పాత్రను డిజైన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ముగ్గురు దేవకన్యలు హీరో జీవితంలోకి రావడంతో అతడి కష్టాలు తగ్గకపోగా.. కొత్త సమస్యలు మరింత పెరుగుతాయి. వారి కారణంగా హీరో కుటుంబంలో గందరగోళం ఏర్పడటం, హీరో-హీరోయిన్ల మధ్య అపార్థాలు రావడం వంటి అంశాలతో వరుసగా హాస్యభరితమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొంతకాలంగా విభిన్నమైన కథలు, సీరియస్ పాత్రలు చేస్తున్న అల్లరి నరేష్‌ను మరోసారి పక్కా కామెడీ పాత్రలో చూడటం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని ఇస్తోంది. ట్రైలర్లో ఆయన కామిక్ టైమింగ్, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్, చిలిపి చేష్టలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓజీ డైలాగ్‌ను అనుకరిస్తూ అల్లరి నరేష్ చేసే కామెడీ ట్రైలర్లో ప్రత్యేకంగా నిలిచింది. తనకు బాగా తెలిసిన ఎంటర్టైన్మెంట్ జోనర్లోకి అల్లరి నరేష్ తిరిగి రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రీషా సింగ్ నటిస్తున్నారు. దేవకన్యల పాత్రలకు తగ్గట్టుగా వీరు కనిపిస్తూ కథలో కీలకమైన హాస్యానికి కారణమవుతారని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
మరోవైపు సురభి కథానాయికగా నటిస్తున్నారు. హీరో కుటుంబంలో ఈ ముగ్గురు అప్సరసల రాక ఎలాంటి కలకలం రేపింది? సూర్య తన సమస్యల నుంచి బయటపడ్డాడా? ఇంద్రుడు వీరిని ఎందుకు శిక్షించాడు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. వినోదభరితమైన ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ‘రంబా ఊర్వశి మేనక’ చిత్రం సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఆసక్తికరమైన కాన్సెప్ట్, ముగ్గురు అప్సరసల హంగామా, వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్ర, అల్లరి నరేష్ మార్క్ కామెడీతో ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగిస్తోంది.