అన్ని భావోద్వేగాల్లో కామెడీ పండించడమే కష్టమని చెబుతుంటారు. అలాంటి హాస్యాన్ని 50కి పైగా చిత్రాల్లో ప్రేక్షకులకు విజయవంతంగా అందించారు ‘అల్లరి’ నరేష్. నవ్వులే కాదు ‘నేను’, ‘ప్రాణం’, ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘నాంది’ వంటి ఎమోషనల్ చిత్రాల్లోనూ మెప్పించారు. 2002లో ‘అల్లరి’ చిత్రంతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం నేటికి 20 ఏళ్లకు చేరుకుంది. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో ఎదురైన అనుభవాలు ఆయన తాజా ఇంటర్వ్యూలో వివరించారు.
చలపతి రావు గారి అబ్బాయిగా రవిబాబు పరిచయం. ఆయన దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తూ ‘అల్లరి’ సినిమా ప్లాన్ చేశారు. ఒకరోజు ఫోన్ చేసి ఉన్నపళంగా రామానాయుడు స్టూడియోకి వచ్చేయ్ అన్నారు. నువ్వే ఈ సినిమాలో హీరో అనేసరికి నమ్మలేకపోయాను. అలా నా మొదటి సినిమా ప్రారంభమైంది. అదే సినిమా నా ఇంటిపేరుగా మారిపోయింది. మొదట్లో నటిస్తున్నప్పుడు ఓ ఐదు సినిమాల్లోనైనా అవకాశం వస్తుందా అనిపించేంది. 57 చిత్రాల్లో నటించడం, 20 ఏళ్లు ఇండస్ట్రీలో కొనసాగడం ఆనందంగా ఉంది. అప్పుడే 20 ఏళ్లు గడిచాయా అన్నట్లు ఉంది.
నాన్నగారి సపోర్ట్ బాగా ఉండేది
నా కెరీర్ ప్రారంభంలో నాన్నగారి సపోర్ట్ బాగా ఉండేది. మా కాంబినేషన్ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అలా కెరీర్లో ఉన్నతమైన స్థాయిని చూశాను. రోజుకు 14 గంటలు పనిచేసిన సందర్భాలున్నాయి. ఒక సినిమా షూటింగ్ చేస్తూ మరో రెండు మూడు సినిమాలు లైనప్‌లో ఉండేవి. ‘సుడిగాడు’ సినిమా నా కెరీర్లో పెద్ద విజయాన్ని అందించింది. ఈ సినిమాలో పూర్తిస్థాయి స్పూఫ్ కామెడీ చేశాం. నా వరకు అదో ట్రెండ్‌గా మారిపోయింది.
ఆలస్యంగా తెలుసుకున్నా
ప్రతి సినిమాలో స్పూఫ్‌లు పెట్టడం సరైంది కాదని ఆలస్యంగా తెలుసుకున్నా. అప్పటి నుంచి వాటికి దూరంగా ఉంటూ కొత్త తరహా సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నాను. ఆ క్రమంలోనే నాంది సినిమా చేశాను. గతంలోనూ ‘ప్రాణం’, ‘నేను’, ‘గమ్యం’ లాంటి చిత్రాలు నటుడిగా నాలో కొత్త కోణాన్ని చూపించాయి. ‘నాంది’ మరోసారి గుర్తు చేసింది.
సంతృప్తి దక్కితే చాలు
నాన్న గారు పెద్ద హీరోలతో సినిమాలు చేసి ఇంటికొచ్చాక, ఆ సన్నివేశాలు ఎంత బాగా చేశారో మాతో పంచుకునేవారు. ప్రస్తుతం నేనూ సంతృప్తినే కోరుకుంటున్నా. మనం చేసిన పని గర్వంగా అనిపించాలి. అలాంటి కథలు, పాత్రల్లో నటించాలని ఉంది. నేను చేసే సినిమాల తరహా మార్చాను కానీ వినోదాత్మక చిత్రాలు చేయకూడదని కాదు. ప్రస్తుతం వినోదం తీరు మారింది. అయితే కామెడీ ఎప్పటికీ బోర్ కొట్టదు.
ప్రస్తుతం రెండు చిత్రాల్లో
ఇప్పుడు ‘సభకు నమస్కారం’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రాల్లో నటిస్తున్నాను. ఇవి కాక మరికొన్ని సినిమాలు కథా చర్చల దశలో ఉన్నాయి.