‘బింబిసార’ చిత్రంతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు వశిష్ట. చరిత్ర, వర్తమానాన్ని అనుసంధానిస్తూ వినూత్న ఫాంటసీ కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన తదుపరి చిత్రంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. కొద్ది వారాల క్రితం విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ పంచభూతాల థీమ్‌తో ఆసక్తిని రేకెత్తించింది.
తొలి చిత్రం తరహాలోనే సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ కథలో ఆధ్యాత్మిక అంశాలు ప్రధానంగా ఉంటాయని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘చిరంజీవిగారు పూర్తి స్థాయి ఫాంటసీ కథలో నటించి చాలా రోజులైంది. అందుకే ఆయన కోసం పంచభూతాలు, త్రిశూల శక్తి అనే అంశాలకు ఆధ్యాత్మికత కలబోసి అద్భుతమైన కథను సిద్ధం చేశా.
ఈ సినిమాలో 70 శాతం వరకు గ్రాఫిక్స్ ఉంటాయి. ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫాంటసీ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.