Globe Trotter Event | ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వెల్లడించే ‘గ్లోబ్ ట్రాటర్’ (Globe Trotter) ఈవెంట్ నేడు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగానే కాక, అంతర్జాతీయంగానూ భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు జరగబోయే ఈ ఈవెంట్ ద్వారా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ వంటి కీలక సమాచారం వెల్లడవుతుందని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది ఒక యాక్షన్-అడ్వెంచర్ నేపథ్యం ఉన్న గ్లోబల్ ప్రాజెక్ట్ అని అందుకే ఈవెంట్‌కు ‘గ్లోబ్ ట్రాటర్’ అనే పేరు పెట్టినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. రాజమౌళి, ఆయన టీమ్ ఈ ఈవెంట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రోజు ఈ ఈవెంట్ ద్వారా రాజమౌళి ఎలాంటి సంచలన ప్రకటన చేయబోతున్నారనే దానిపై సినీ ప్రపంచం మొత్తం ఆసక్తిగా దృష్టి సారించింది.