రావణ్ నిట్టూరు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. ఆనంద్. జె దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్, రెడ్డి రాజేంద్ర నిర్మాతలు. గురువారం థియేట్రికల్ ట్రైలర్ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. దోపిడీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్గా ట్రైలర్ ఆకట్టుకుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘తిరుపతిలో జరిగే కథ ఇది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. అంతా కొత్త నటీనటులతో ఈ సినిమా తీశాం.
షూటింగ్ మొత్తం తిరుపతిలోనే జరిగింది. తిరుమలలో షాపు సంపాదించుకోవాలని ఓ యువకుడు చేసే ప్రయత్నాలు ఏమిటన్నదే చిత్ర కథాంశం. ప్రతి సీన్లో వెంకటేశ్వర స్వామి రిఫరెన్స్ ఉంటుంది’ అన్నారు. ఈ నెల 18న చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. తనకు నాటకరంగంలో అనుభవం ఉందని, మంచి పాత్ర ద్వారా కథానాయకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని రావణ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డీజీకే, సంగీతం: ఫణి కల్యాణ్, దర్శకత్వం: ఆనంద్ జె.