సినీ స్టార్స్ పిల్లలు సినీస్టార్సే కావాలనుకుంటారు. అలాగే తమ పిల్లలు తమ లెగసీని కొనసాగించాలని స్టార్సందరూ ఆశిస్తుంటారు. ఆ మాటకొస్తే ఏ రంగంలోనైనా ఇది పరిపాటే. కానీ బాలీవుడ్ మేటి నటి అలియాభట్ ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. తాను సినీస్టార్ని అయినంత మాత్రాన తన బిడ్డ కూడా ఇదే రంగంలో రాణించాలని తాను కోరుకోననీ. వృత్తి ఏదైనా అది కూతురు రాహాకు ఇష్టమైనదై ఉండాలనీ అలియా అంటున్నది. ‘రహాను చూసినప్పుడల్లా నాకు ఆమెలో ఓ యోధ కనిపిస్తుంది.
తను భవిష్యత్లో ఒలింపియన్ కావాలని కోరుకుంటున్నా. గ్లామర్ ప్రపంచంలోని ఒత్తిడి, అనిశ్చితిపై నాకు పూర్తి అవగాహన ఉంది. నా బిడ్డ వాటికి దూరంగా ఉండాలి. క్రమశిక్షణతో, శారీరక, మానసిక దృఢత్వంతో ముందుకెళ్లాలి. నా వరకు ఓ తల్లిగా.. తను క్రీడారంగాన్ని ఎంచుకుంటే బాగుంటుందని భావిస్తున్నా. కానీ అది కూడా ఆమె ఇష్టమే. ఎదిగేకొద్దీ తను ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటుందో చూడాలి’ అని చెప్పుకొచ్చింది అలియాభట్.