Alia Bhatt | బాలీవుడ్ అగ్ర నటి అలియాభట్ ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి రక్తి కట్టిస్తుంది. ‘గంగూభాయి కతియావాడి’ చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఈ భామ కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తుంటుంది. ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా ఓ హారర్ కామెడీ థ్రిల్లర్‌లో నటించనుంది. ఈ జోనర్లో ఆమెకిది తొలి చిత్రమని చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా స్త్రీ, స్త్రీ-2, ముంజ్యా, భేడియా వంటి సినిమాలను తెరకెక్కించాడు నిర్మాత దినేష్ విజన్. ఇదే యూనివర్స్‌లో ఆయన ‘ఛముండా’ అనే పేరుతో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా అలియాభట్ నటించనుందని తెలిసింది.
ఇప్పటికే ఆమెతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యానని, సినిమాకు దాదాపుగా అంగీకరించిందని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అలియాభట్ ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో భర్త రణబీర్‌కపూర్‌తో కలిసి నటిస్తున్నది. విక్కీకౌశల్ మరో కథానాయకుడు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది.