Alia Bhatt | స్పై యూనివర్స్ కథల్ని తెరకెక్కించడంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ది ప్రత్యేకస్థానం. ఇప్పుడు తొలిసారిగా ఈ తరహా కథనే నిర్మిస్తూ కొత్త ప్రయోగానికి నాంది పలికారు యష్‌రాజ్ సంస్థవారు. ఈ సంస్థ నుంచి దేశంలోనే తొలిసారిగా లేడీ ఓరియెంటెడ్ స్పై మూవీ రానుంది.
ఇందులో లేడీ స్పైగా అలియాభట్ లీడ్‌రోల్‌ను పోషించనుంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రంలో శార్వారి కూడా మరో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇందులో అలియాతోపాటు శార్వారీ కూడా స్పై ఏజెంట్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఆల్ఫా’ అనే పేరును ఖరారు చేశారు.
‘ఆల్ఫా’ అనే టైటిల్‌కి మగవారు మాత్రమేకాదు.. మహిళలూ అర్హులే అని చాటిచెప్పేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ‘నిశితంగా గమనించండి.. ప్రతి నగరం ఒక అడవే.. ప్రతి అడవినీ ఏలేది.. ఆల్ఫా!’అని టైటిల్ రివీల్ వీడియోలో అలియా చెప్పిన డైలాగ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నది. యష్‌రాజ్ ఫిల్మ్ నిర్మించిన ‘ది రైల్వేమెన్’ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న శివ్ రవైల్ ఈ చిత్రానికి దర్శకుడు.