NTR | ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది బాలీవుడ్ నాయిక అలియాభట్. సీత పాత్రలో ఆమె అభినయం అందరిని ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ మరోమారు ఎన్టీఆర్ సరసన నటించనున్నట్లు తెలిసింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘వార్-2’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన హృతిక్ రోషన్‌తో కలిసి నటించనున్నారు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ కొంత భాగం పూర్తయింది.
ఏప్రిల్ నెలలో మొదలయ్యే కొత్త షెడ్యూల్లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా కోసం ఆయన రెండు నెలల పాటు డేట్స్ కేటాయించారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో జోడీగా అలియాభట్‌ను ఎంపిక చేశారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ‘ఆర్ఆర్ఆర్’తో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్-అలియాభట్ మరోమారు వెండితెరపై ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం అలియాభట్ హిందీ ‘జిగ్రా’ చిత్రంలో నటిస్తున్నది.