Agent Movie | అక్కినేని నట వారసుడు అఖిల్ కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కాస్త ఊరటనిచ్చింది. కానీ ఈ చిత్రం అఖిల్‌కు మాత్రం కమర్షియల్ హిట్టును ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాలని సురేందర్ రెడ్డితో చేతులు కలిపాడు. ప్రస్తుతం వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అయినట్లు గతంలో విడుదలైన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. కండలు తిరిగిన దేహంతో అఖిల్ ‘రా ఏజెంట్’గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అగస్టు 12న విడుదల కానున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏజెంట్ చిత్రం వాయిదా పడనుందట.
ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుండి షూటింగ్‌కు అంతరాయం కలుగుతూనే ఉంది. ఇప్పటికే షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా ఉండటంతో షూటింగ్‌కు చాలా సమయం పడుతుందట. దాంతో చిత్ర బృందం విడుదల తేదీని వాయిదా వేయాలని భావిస్తుందట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానున్నట్లు టాక్. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలే అఖిల్ మనాలీ షెడ్యూల్లో దిగిన ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే.