Nagarjuna | అక్కినేని అఖిల్ పెళ్లి పీటలు ఎక్కే సమయం ఆసన్నమైంది. జూన్ 6న అఖిల్ ఏడడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో నాగార్జున తన కుమారుడి వివాహానికి పలువురు సెలబ్రిటీలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించిన నాగార్జున తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కొడుకు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును స్వయంగా ఆహ్వానించి వివాహ పత్రిక అందజేశారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కూడా నాగార్జున ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది. గతేడాది నవంబర్ నెలలో అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరగగా,ఆ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వారి వివాహం జూన్ 6న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే జరగనున్నట్లు సమాచారం. గతేడాది హీరో నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం సైతం అదే స్టూడియోలో జరిగిన విషయం విదితమే.
గతంలో అఖిల్.. శ్రియా భూపాల్ అనే యువతితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. కాని పలు కారణాల వలన వారి బంధం పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఇక కొన్నాళ్లుగా సింగిల్‌గా ఉన్న అఖిల్ జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. జైనబ్ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె. ఇక అక్కినేని అఖిల్ కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. లెనిన్ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ చిత్రాన్ని కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.