Akhil Akkineni | టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఇంట మరోసారి పెళ్లిభాజాలు మోగనున్నాయి. హీరో అక్కినేని అఖిల్ పెళ్లి త్వరలోనే జరుగనున్నది. జైనాబ్ రవద్జీతో అఖిల్ ఎంగేజ్మెంట్ గతేడాది నవంబర్ 26న జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని ప్రకటించారు. తాజాగా వీరిద్దరి పెళ్లికి డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మార్చి 24న వీరిద్దరి పెళ్లి జరుగుందని తెలుస్తున్నది. అయితే, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అఖిల్ పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహించేందుకు నాగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించనున్నారు.
అఖిల్, జైనాబ్ పెళ్లి సైతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగనున్నట్లు సమాచారం. లేదంటే డెస్టినేషన్ వెడ్డింగ్‌కి వెళ్లే ఛాన్స్ ఉందని.. ఆ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు టాక్ నడుస్తున్నది. త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అఖిల్ సోదరుడు నాగచైతన్య ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటి శోభితా ధూళిపాళను అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన వేదికపై సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.