‘అఖండ’ సినిమా బాలకృష్ణ కెరీర్‌కి మేలి మలుపు. ఎందుకంటే.. అక్కడ్నుంచి మొదలైన బాలయ్య విజయవిహారం ఇంకా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. లైన్లో నాలుగు హిట్లను ఆపకుండా కొట్టారు బాలయ్య. ఇప్పుడు అయిదో హిట్ కోసం ‘అఖండ 2- తాండవం’ సినిమాని రెడీ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను ఎంతో ప్రస్టేజియస్‌గా పానిండియా స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వచ్చే వారం నుంచి హిమాలయాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు బోయపాటి. ఇందులో మురళీకృష్ణగా,అఖండ రుద్రసికిందర్ అఘోరాగా రెండు విభిన్నమైన పాత్రల్ని బాలయ్య పోషిస్తున్న విషయం తెలిసిందే. రేపు హిమాలయాల్లో అఖండ రుద్రసికిందర్ అఘోరా పాత్రపై కీలక సన్నివేశాలను తీస్తారట. ప్రేక్షకుల్ని రోమాంచితం చేసేలా ఈ సన్నివేశాలుంటాయని చిత్రబృందం చెబుతున్నది. ఈ షెడ్యూల్లో బాలకృష్ణతోపాటు కీలక పాత్రధారులంతా పాల్గొంటారట. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న విషయం తెలిసిందే.