Akhanda 2 | నందమూరి నటసింహం బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సింహ, లెజెండ్, అఖండ వంటి ఘన విజయాల తర్వాత ఈ జోడీ మరోసారి స్క్రీన్ మీద అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది. అఖండ 2 చిత్రం 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘అఖండ’ కు సీక్వెల్ కావడం విశేషం. ఆ చిత్రంలో బాలయ్య పోషించిన ఆఘోర పాత్ర, బోయపాటి మాస్ మేకింగ్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ ఫార్ములాను మరింత పవర్‌ఫుల్‌గా స్క్రీన్ మీదకి తీసుకురావాలని బోయపాటి తెగ కష్టపడుతున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీలో ప్రగ్యా జైశ్వాల్, సంజయ్ దత్, ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, జగపతిబాబు, హర్షాలీ మల్హోత్రా వంటి తారాగణం కనిపించనున్నారు.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25, దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అదే సమయానికి పవన్ కళ్యాణ్ ఓజీ కూడా వస్తుండడంతో అఖండ 2 రిలీజ్ విషయంలో కాస్త సస్పెన్స్ నెలకొంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం సినిమాను డిసెంబర్లో లేదా సంక్రాంతికి వాయిదా వేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా, మేకర్స్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అయితే డబ్బింగ్ కూడా పూర్తి కావడంతో సెప్టెంబర్ 25 తేదీని ఫిక్స్ చేసినట్టు సమాచారం. పోటీలో వెనకడుగు వేయబోమని టీం ధీమాగా ఉంది.మరి రిలీజ్ డేట్‌పై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. బాలకృష్ణకు ఇది రెండో సీక్వెల్ కాగా, బోయపాటి శ్రీనుకు ఇది ఫస్ట్ సీక్వెల్. ఇద్దరికీ ఇది మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.
హిందీ బెల్ట్‌లో ‘అఖండ’ డబ్బింగ్ సంచలనం రేపిన నేపథ్యంలో, ‘అఖండ 2’ కూడా భారీ వసూళ్లు రాబడుతుందని టీం భావిస్తోంది. తాజాగా బోయపాటి శ్రీను ఓ ప్రముఖ ఆలయాన్ని సందర్శించడమే కాక, సినిమాలో దేవాలయాల పవిత్రతను కాపాడే ఆఘోర పాత్రగా బాలయ్యను మరింత శక్తివంతంగా చూపించనున్నట్టు సమాచారం. ఈసారి యాక్షన్ సీన్లు, విజువల్ ఎఫెక్ట్స్, సనాతన ధర్మం అంశాలు .. ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిలో నార్త్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా ఉండనున్నాయి. ‘అఖండ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ 25న విడుదలవుతుందా లేక వాయిదా పడుతుందా అన్నది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.