అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్న ‘థాంక్ గాడ్’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందన రాబట్టుతున్నది. ఇందులో ఆధునిక చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్, సగటు వ్యక్తిగా సిద్ధార్థ్ మల్హోత్రా, అతని భార్యగా రకుల్ ప్రీత్‌సింగ్ నటించారు. యమలోకం నేపథ్యంతో సాగిన ఈ ట్రైలర్ నవ్వులు పూయిస్తున్నది.
రోడ్డు ప్రమాదంలో మరణించిన కథానాయకుడు యమలోకం వెళ్లడం, అక్కడ చిత్రగుప్తుడు హీరో చేసిన తప్పులన్నీ ఏకరువు పెట్టడం వినోదాన్ని అందించింది. ఒక సగటు వ్యక్తి తన జీవితంలో చేసే తప్పులన్నీ చిత్రగుప్తుడు గుర్తుచేస్తుంటాడు. ఒకరి కోపం, లోభం, మోహం వంటి లోపాలన్నీ ఇతరులను ఎలా ఇబ్బంది పెడుతున్నాయో చూపించారు. ఒక చిన్న గేమ్ ఆడదామా అంటూ చిత్రగుప్తుడు హీరోను అడగటం, అక్కడ వేసే ప్రశ్నలు, చెప్పే జోకులు సరదాగా సాగాయి. టీ సిరీస్, మారుతి ఇంటర్నేషనల్ సంస్థలు నిర్మిస్తుండగా…ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రిలీజ్‌కు నెలన్నర రోజుల ముందుగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయడం విశేషం.