‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో తెలుగులో తొలిసారి బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సాధించింది ఐశ్వర్యరాజేష్. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ భామకు అవకాశాలు బాగా వస్తాయనుకున్నారు. అయితే సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండటం, తమిళంలో వరుస కమిట్మెంట్స్ వల్ల ఏడాదికాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నది ఐశ్వర్యరాజేష్. తాజా సమాచారం ప్రకారం ఈ తెలుగందం తెలుగులో మరో బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది. నాగార్జున వందో చిత్రంలో ఐశ్వర్యరాజేష్ కథానాయికగా ఖరారైందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘కింగ్100’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. రా.కార్తీక్ దర్శకత్వంలో యాక్షన్ కలబోసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో కథానాయిక కోసం కొన్ని నెలలుగా అన్వేషణ జరుగుతున్నది. చివరగా చిత్రబృందం ఐశర్వరాజేష్ వైపు మొగ్గుచూపిందని చెబుతున్నారు. ఈ సినిమాలో సీనియర్ కథానాయిక టబు కీలక పాత్రలో కనిపించనుంది. త్వరలో ‘కింగ్100’ షూట్లో ఐశ్వర్యరాజేష్ జాయిన్ అవుతారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.