కథాంశాలపరంగా వైవిధ్యానికి పెద్దపీట వేస్తుంది కథానాయిక ఐశ్వర్యరాజేష్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న విభిన్న కథా చిత్రం ‘డ్రైవర్ జమున’. రోడ్ జర్నీ మూవీగా తెరకెక్కిస్తున్నారు. పా.కిన్ల్సిన్ దర్శకుడు. 18 రీల్స్ పతాకంపై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఇందులో ముఖం మీద రక్తం మరకలతో విచారంగా కనిపిస్తున్నది ఐశ్వర్యరాజేష్. ఈ సినిమాలో ఆమె లేడీ క్యాబ్‌డ్రైవర్ పాత్రలో కనిపించనుంది. ఇందుకోసం ఐశ్వర్యరాజేష్ చాలా మంది లేడీ క్యాబ్‌డ్రైవర్లను కలుసుకొని వారి బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలించి పాత్ర కోసం సహజంగా సిద్ధమైందని చిత్రబృందం పేర్కొంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: గోకుల్ బెనోయ్, సంగీతం: జిబ్రాన్.