Aishwarya Rajesh | కెరీర్ ఆరంభం నుంచి పాత్రలపరంగా ప్రయోగాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది ఐశ్వర్య రాజేష్. మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకుంది. ఆమె తాజా చిత్రం ‘ఫర్హానా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో ఐశ్వర్యరాజేష్ నటనకు ప్రశంసలొస్తున్నాయి. ఇటీవల చెన్నైలోని ఓ థియేటర్లో సినిమాను వీక్షించి బయటకొచ్చిన ఐశ్వర్య రాజేష్‌ను చూసిన అభిమానులు సూపర్‌స్టార్ అంటూ నినాదాలు చేశారు.
వీటిపై ఆమె స్పందిస్తూ ‘నన్ను అలా బిరుదులతో పిలవొద్దు. మనకు ఉన్న సూపర్‌స్టార్ ఒక్కరే. ఆయనే రజనీకాంత్. నేను కూడా రజనీ సర్ వీరాభిమానిని. ‘సూపర్‌స్టార్’ అని పిలిపించుకునే అర్హత ఆయనొక్కరికే ఉంది’ అని చెప్పింది. తమిళ చిత్రసీమలో సీనియర్ నటి నయనతారను ఆమె అభిమానులు లేడీ సూపర్‌స్టార్ అని పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యరాజేష్ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘ఫర్హానా’ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ముస్లిమ్ అమ్మాయి పాత్రలో కనిపించింది.