‘సినిమాలను ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజించి చూడటం మంచి పద్ధతి కాదు. ప్రతి చిత్రాన్ని భారతీయ సినిమాగానే చూస్తాను’ అని చెప్పింది సీనియర్ కథానాయిక ఐశ్వర్యరాయ్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సమకాలీన సినీరంగంపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఉత్తరాది చిత్రాలపై దక్షిణాది చిత్రాలు ఇటీవల కాలంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి కదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ప్రతి ఇండస్ట్రీలో పోటీ సహజం.
అంత మాత్రాన ఉత్తరాది, దక్షిణాది అనే భేదాల్ని ప్రదర్శించవొద్దు. కళ సార్వజనీనం. అవకాశాల కోసం నటీనటులు ఎక్కడైనా ప్రయత్నాలు చేయొచ్చు. నేను హిందీతో పాటు దక్షిణాదిలో కూడా మణిరత్నం, శంకర్ వంటి అగ్ర దర్శకులతో పనిచేశాను. భాషా భేదాలతో సంబంధం లేకుండా ప్రతీ సినిమాను భారతీయ సినిమాగానే భావిస్తా’ అని ఐశ్వర్యరాయ్ పేర్కొంది.