పాపం పసివాడు
ఆహా: సెప్టెంబర్ 29
తారాగణం: శ్రీరామచంద్ర, రాశీసింగ్, గాయత్రి చాగంటి, శ్రీవిద్య తదితరులు
దర్శకత్వం: లలిత్ కుమార్
ఓటీటీ ప్లాట్ఫామ్లో క్రైమ్, హారర్ థ్రిల్లర్స్ తర్వాత కామెడీ చూసేందుకే ప్రేక్షకులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే హాస్య ప్రధానంగా, యూత్‌ను టార్గెట్ చేస్తూ దర్శకుడు లలిత్ కుమార్ చతుర్ముఖ ప్రేమాయణాన్ని ‘పాపం పసివాడు’గా ఓటీటీకెక్కించాడు.
ఇండియన్ ఐడల్ ఫేమ్ శ్రీరామచంద్ర కథానాయకుడిగా నటించడంతో క్రేజ్ బాగానే వచ్చింది. ఐదు ఎపిసోడ్లు దేనికదే కామెడీని పంచుతాయి. నిడివి తక్కువగా ఉండటంతో బోర్ రాదు. అక్కడక్కడా ట్రాక్ తప్పినట్టు అనిపించినా కథనంలో వేగం ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఈ పసివాడి కథ ఏంటంటే.. క్రాంతి (శ్రీరామచంద్ర), డింపీ (గాయత్రి) ప్రేమికులు. వీళ్ల లవ్‌ట్రాక్ ఆరేండ్లుగా సాగుతుంటుంది.
ఓ రోజు డింపీ దగ్గర పెండ్లి ప్రస్తావన తెస్తాడు క్రాంతి. అందుకు ఆమె నో చెబుతుంది. దాంతో అతను మద్యానికి బానిసై డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు. మరోవైపు పెండ్లి చేసుకోమని క్రాంతి తల్లి అతణ్ని ఒత్తిడి చేస్తుంటుంది. వీటన్నిటికీ దూరంగా ఉండాలని క్రాంతి స్నేహితుల దగ్గరికి వెళ్లిపోతాడు. క్రాంతి అనుకోకుండా ఒకరోజు ఓ పార్టీలో చారు (రాశీసింగ్)ను కలుస్తాడు. ఆమె ప్రేమలో పడతాడు. కానీ, చారు ఎక్కడుందీ కనుక్కోలేకపోతాడు. చివరికి తల్లి మాట కాదనలేక అనూష (శ్రీవిద్య)తో పెండ్లికి ఒప్పుకొంటాడు. వాళ్ల నిశ్చితార్థం జరుగుతుండగా చారు అక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? క్రాంతి పెండ్లి ఎవరితో జరిగిందన్నది మిగతా కథ.