Allu Arjun | అగ్రహీరో అల్లు అర్జున్ ‘పుష్ప-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘పుష్ప’కి పూర్తి భిన్నంగా ఇందులో కేరక్టరైజేషన్ ఉంటుందని తెలుస్తున్నది. తొలి భాగానికి జాతీయ ఉత్తమనటుడిగా అవార్డు రావడంతో, ఈ మలిభాగంపై దర్శకుడు సుకుమార్ ప్రత్యేకదృష్టి పెట్టారు. ప్రేక్షకుల ఊహలకు అందని ట్విస్ట్ ఈ కథ లో ఉంటుందని చిత్రబృందం తెలియజేస్తున్నది. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొంటారు బన్నీ. ఇదిలావుంటే. ఇటీవల ఓ పాపులర్ లిక్కర్ బ్రాండ్‌కు సంబంధించిన వ్యాపార ప్రకటనలో నటింపజేయడానికి సదరు సంస్థవారు బన్నీని కలవడం జరిగింది. ఆ యాడ్‌ఫిలింలో నటించినందుకు గాను వాళ్లు బన్నీకి 10కోట్లు ఆఫర్ చేశారు. అయితే, బన్నీ వారి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. యువతరానికి ఆదర్శంగా ఉండాల్సిన తాను ఇలాంటి ప్రకటనల్లో నటించడం సబబుకాదని వారితో బన్నీ చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. నమ్మిన సిద్ధాంతంకోసం కోట్ల రూపాయల ఆఫర్‌ని కూడా వదులుకున్న బన్నీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.