జీవా, అర్జున్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న పాన్ ఇండియా ఫాంటసీ థ్రిల్లర్ ‘అఘతియా’. రాశీ ఖన్నాతోపాటు యూరోపియన్ నటి మటిల్డా, అమెరికన్ నటుడు ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పా.విజయ్ దర్శకుడు. డాక్టర్ ఈశారి కె.గణేశ్ నిర్మాత. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్ కథలోని లీడ్ యాక్టర్స్ అందర్నీ రివీల్ చేసింది. ఈ సినిమా గురించి దర్శకుడు పా.విజయ్ మాట్లాడుతూ ‘ఇది మానవసంబంధాలతో కూడిన ఫాంటసీ డ్రామా. రెండు పాత్రల మధ్య అనుబంధం చుట్టూ ఈ కథ నడుస్తుంది. అర్జున్, జీవా ఆ పాత్రల్లో కనిపిస్తారు. తెలియని ప్రపంచంలో వారిద్దరి ప్రయాణాన్ని ఆవిష్కరించే అద్భుత చిత్రణ ఈ సినిమా. ఈ సినిమాలో 90 నిమిషాల పాటు సాగే సీజీ విజువల్స్ ఆడియన్స్‌ని విశేషంగా అలరిస్తాయి. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది’ అని తెలిపారు. యోగిబాబు, వీటీవీ గణేశ్, మొట్టా రాజేంద్రన్, రెడిన్ కింగ్ల్సీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దీప్ కుమార్ , సంగీతం: యువన్ శంకర్ రాజా, సహనిర్మాత: వామ్ ఇండియా అనీస్దేవ్.