Akhil Akkineni Agent OTT Announcement | కొన్ని సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయంటే చాలు ప్రేక్షకులు ఆసక్తిగా చూపిస్తారు. ఆ సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ కళ్లు కాయాలు కాచేలా ఎదురుచూస్తారు. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి డిజాస్టార్ అయిన ఒక సినిమా కోసం ఓటీటీ లవర్స్ గత రెండేండ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏదో కాదు. అక్కినేని వారసుడు అఖిల్ నటించిన ‘ఏజెంట్’. అవును గత రెండు సంవత్సరాల నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రం ఓటీటీ డేట్ నిర్వహాకులు తాజాగా ప్రకటించారు.
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘ఏజెంట్’ (Agent). ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. సాక్షి వైద్య కథానాయికగా నటించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టార్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్‌కి సురేందర్ రెడ్డి, అఖిల్ ఇంకో సినిమాకు కూడా సంతకం చేయలేదంటే ఆ సినిమా డిజాస్టార్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే గతంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఇక గత రెండు ఏండ్లుగా ఊరిస్తున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ ఈ సినిమాను మార్చి 14 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రిక్కీ అలియాస్ రామకృష్ణకు (అఖిల్) స్పై అవ్వాలన్నదే జీవితాశయం. భారత గూఢచార సంస్థ ‘రా’లో చేరి దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో ఉంటాడు. అందుకోసం ‘రా’లో చేరేందుకు మూడుసార్లు పరీక్షలు రాసి విఫలమవుతాడు. అయితే ఎలాగైనా తాను ‘రా’ అధికారుల దృష్టిలో పడాలని ఎథికల్ హ్యాకింగ్‌కు పాల్పడతాడు. ‘రా’ అధిపతి డెవిల్ అలియాస్ మహదేవ్ (మమ్ముట్టి) కంప్యూటర్ను హ్యాక్ చేసి ఆయన మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తాడు. అయితే అవి కూడా ఫలించకపోవడంతో రిక్కీ నిరాశకు గురవుతాడు. మరోవైపు ‘రా’ మాజీ ఏజెంట్ ధర్మ అలియాస్ గాడ్ (డినో మోరియా) సిండికేట్‌ను ఏర్పాటు చేసుకొని శత్రుదేశాల సహాయంతో ఇండియాను నాశనం చేయాలని చూస్తుంటాడు. గాడ్ కుట్రలను ఛేదించడానికి రిక్కీని రంగంలోకి దింపుతాడు మహదేవ్. గాడ్ పన్నాగాలకు రామకృష్ణ ఎలా అడ్డుకట్ట వేశాడు ? అసలు ‘రా’ మాజీ ఏజెంట్ అయిన గాడ్ దేశంపై ఎందుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు? ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి జయకిషన్ (సంపత్‌రాజ్) పాత్ర ఏమిటి? ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసే క్రమంలో రామకృష్ణకు ఎదురైన సవాళ్లేమిటన్నదే మిగతా చిత్ర కథ..
ALERT: A spy like no other is on the move!
MISSION BRIEF: Slick moves. Deadly stakes. Ultimate action.
Witness high-octane action and unmatched style starring Akhil Akkineni, Mammootty, Dino Morea, and Sakshi Vaidya on March 14, only on Sony LIV pic.twitter.com/r3bRSw4qyv— Sony LIV (@SonyLIV) March 5, 2025