Nayanatara | లేడి సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ మారోసారి వివాదంలో చిక్కుకున్నది. వ్యక్తిగత, వృత్తిగత జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ ఇబ్బందుల్లోపడింది. ఇప్పటికే కాపీరైట్ వివాదం సాగుతున్నది. తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. చంద్రముఖి సినిమాకు సంబంధించిన ఫుటేజీని అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ ఏపీ ఇంటర్నేషనల్ అనే సంస్థ డాక్యుమెంటరీ నిర్మాతలపై, నెట్‌ఫ్లిక్స్‌పై రూ.5కోట్ల దావా వేసింది. ఈ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. డాక్యుమెంటరీ నిర్మాతలు టార్క్ స్టూడియో ఎల్ఎల్పీకి, నెట్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది.
చంద్రముఖి మూవీ ఆడియో, వీడియో హక్కులు తమ వద్దే ఉన్నాయని, యూట్యూబ్ నుంచి సేకరించిన క్లిప్పింగ్స్‌ను అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో చట్టవిరుద్ధంగా ఉపయోగించారని ఏపీ ఇంటర్నేషనల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించింది. ఈ విషయంలో లీగల్ నోటీసు పంపగా.. ఆ తర్వాతే నిర్మాతలు తమను లైసెన్స్ కోసం సంప్రదించారని సంస్థ పేర్కొంది. తమ సినిమా దృశ్యాలను డాక్యుమెంటరీ నుంచి తక్షణమే తొలగించాలని.. లేకపోతే రూ.5కోట్ల నష్టపరిహారం చెల్లించేలా చూడాలని సంస్థ కోర్టును కోరింది. ఇదిలా ఉండగా.. నయన్ డాక్యుమెంటరీ గత ఏడాది నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సమయంలో హీరో, నిర్మాత ధనుష్ సైతం లీగల్ నోటీసులు పంపారు. ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీకి నిర్మాతగా ధనుష్ వ్యవహరించారు. ఈ మూవీ ఫుటేజీని అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ నయనతారపై రూ.10కోట్ల దావా వేశారు. తాజాగా ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ సైతం కోర్టుకెక్కింది. ప్రస్తుతం ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.