అగ్ర హీరో చిరంజీవితో త్రిష మళ్లీ జోడీకట్టనుందా? సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్నది. చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లుగా మాస్, వినోదం, యాక్షన్ అంశాలకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కథానాయిక కోసం చిత్రబృందం అన్వేషణ సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో శృతిహాసన్‌ను కథానాయికగా ఎంపికచేసినట్లు వార్తలొచ్చాయి. తాజాగా శృతిహాసన్ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానంలో త్రిషను హీరోయిన్గా ఖరారు చేసినట్లు తెలిసింది. గతంలో ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవితో జోడికట్టింది త్రిష. దాదాపు పదహారేళ్ల తర్వాత వెంకీ కుడుముల సినిమా ద్వారా మళ్లీ వీరిద్దరూ కలిసి నటించనుండటం గమనార్హం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.