కథానాయిక అదితిరావు హైదరీ బాలీవుడ్లో ఓ ప్రేమకథా చిత్రంలో నటించనుంది. ‘ఓ సాథీ రే’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ షోరన్నర్‌గా వ్యవహరించనున్నారు. అరీష్ అలీ దర్శకత్వం వహిస్తారు. అర్జున్ రాంపాల్, అవినాష్ తివారి ప్రధాన పాత్రధారులు. బాలీవుడ్లో హృద్యమైన ప్రేమకథా చిత్రాలకు చిరునామాగా ఇంతియాజ్ అలీ పేరు తెచ్చుకున్నారు.
ఆయన డైరెక్షన్లో వచ్చిన రాక్‌స్టార్, జబ్ వీ మెట్, లవ్ ఆజ్ కల్ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజా చిత్రం ‘ఓ సాథీ రే’ ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ‘గత కాలపు విలువలు, హృదయభావనలతో నడిచే ఆధునిక ప్రేమకథా చిత్రమిది. ఏ మోడరన్ స్టోరీ విత్ వింటేజ్ హార్ట్. మెట్రోపాలిటన్ సిటీలో జరిగే ప్రేమకథగా ఆకట్టుకుంటుంది’ అని ఇంతియాజ్ అలీ చెప్పారు. సీట్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.