Adipurush Movie Leaked | ఆదిపురుష్ రిలీజై రెండు వారాలు దాటింది. ట్రైలర్, పాటలతో ఎంతెంత పాజిటీవిటీ సంపాదించుకుందో రిలీజయ్యాకా అంతకంటే ఎక్కువ నెగెటివిటీని ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు ఒక్క పాజిటీవ్ రివ్యూ వస్తే ఒట్టు. సినిమా కథ, క్యారెక్టర్లు వాస్తవ రామాయణానికి భిన్నంగా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. దానికి తోడు డైలాగ్ రైటర్ ముంతాషిర్ శుక్లా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం పుండు మీద కారం చల్లినట్లు అయింది. కలెక్షన్లు కూడా దిబేల్మని పడిపోయాయి. తొలిమూడు రోజుల్లో ముడొందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తే.. ఆ తర్వాతి పది రోజుల్లో వంద కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో వంద కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అది సాధ్యమయ్యేలా అనిపించడం లేదు. కాగా తాజాగా ఈ సినిమా తమిళ వెర్షన్ మాస్టర్ ప్రింట్ ఆన్ లైన్లో లీక్ అయింది. ఆ తమిళ వెర్షన్‌కి ఇప్పుడు ఇతర భాషల ఆడియోని మిక్స్ చేసి అన్ని వెర్షన్లను కూడా లీక్ చేస్తున్నారు. అసలే అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా కొండంత ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా HD వెర్షన్ లీక్ అవడంతో కాస్తో కూస్తో నెట్టుకొస్తున్న కలెక్షన్లు కూడా తగ్గే చాన్స్ ఉంది.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా.. కృతిసనన్ సీత పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడు పాత్ర పోషించాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నాలుగొందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో వంద కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంటుంది.