రివ్యూ: ఆదిపురుష్
తారాగణం: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్సేన్, సోనాల్‌చౌహాన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళణి
సంగీతం: అజయ్-అతుల్
నిర్మాతలు: టీ సిరీస్ భూషణ్‌కుమార్, రైట్రో ఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్
దర్శకత్వం: ఓం రౌత్
Adipurush Movie Review | భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం వెండితెరపై నిత్యనూతనంగా విరాజిల్లుతున్నది. వివిధ భారతీయ భాషల్లో రామాయణ గాథ ఆధారంగా ఎన్నో చిత్రాలు తెరకెక్కి ప్రేక్షకుల్ని అలరించాయి. ఇక తెలుగులో అయితే సంపూర్ణ రామాయణం, సీతారామ కల్యాణం, లవకుశ, సీతా కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, బాల రామాయణం, శ్రీరామ రాజ్యం వంటి చిత్రాలు పండిత పామరుల్ని మెప్పించి అద్భుత విజయాల్ని అందుకున్నాయి. వాల్మీకి విరచితమైన ఈ ఇతిహాస గాథను సరికొత్త సాంకేతిక హంగులతో నేటి తరానికి తెలియజెప్పాలనే లక్ష్యంతో దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘బాహుబలి’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ రాముడి పాత్రను పోషించడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా నిర్మాణ దశ నుంచే ఆసక్తినిరేకెత్తించింది. దాదాపు ఐదొందల కోట్ల బడ్జెట్‌తో రెండేళ్ల పాటు నిర్మాణం జరుపుకుందీ చిత్రం. అత్యాధునిక సాంకేతిక హంగులతో రూపొందిన ఈ రామాయణ గాథ ఎంతవరకు అంచనాల్ని అందుకుందో తెలుసుకుందాం..
కథ:
రామాయణ గాథ ప్రతీ భారతీయుడికి సుపరిచితమే. ‘ఆదిపురుష్’ చిత్రంలో కూడా వాల్మీకి రామాయణంలోని మూలకథను తీసుకున్నారు. సన్నివేశాల అల్లిక పరంగా కొంత సృజనాత్మక స్వేచ్ఛను తీసుకొని అరణ్యకాండం, యుద్ధకాండం ప్రధాన ఇతివృత్తాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయోధ్యాపురిని విడిచి శ్రీరాముడు వనవాసానికి బయలుదేరే సన్నివేశాలతో ఈ కథ ఆరంభమవుతుంది. శ్రీరాముడు తన అర్థాంగి జానకి (కృతిసనన్), సోదరుడు శేషు (సన్నీసింగ్)తో కలిసి వనవాసంలో ఉండగా సాధువురూపంలో వచ్చిన రావణాసురుడు జానకిని అపహరిస్తాడు. ఆ అసురుడి చెర నుంచి తన అర్థాంగిని రక్షించుకోవడానికి రాముడు వానర సేనతో లంకపై యుద్ధం చేయడం, రావణాసంహారం చేసి సీతను తోడ్కోని అయోధ్యకు బయలుదేరడంతో ఈ కథ ముగుస్తుంది. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం రాఘవుడు సాగించిన రణం ఏమిటన్నదే ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కథా విశ్లేషణ:
రామాయణ గాథను ఎందరో దర్శకులు వెండితెర దృశ్యమానం చేశారు. మూల కథను ప్రామాణికంగా తీసుకొని అప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశారు. అయితే ‘ఆదిపురుష్’ చిత్రం విషయంలో దర్శకుడు ఓంరౌత్ మరింత సృజనాత్మక స్వేచ్ఛ తీసుకున్నారు. స్క్రీన్‌ప్లే మొదలుకొని పాత్రధారుల ఆహార్యం, సంభాషణలు, హావభావాలు..ఇలా అన్ని అంశాల్లో తనకు అనువైన రీతిలో కథను మలచుకున్నారు. చాలా సినిమాల్లో రాముడు అనగానే దాదాపు ఒకే తరహా ఆహార్యం స్ఫురణకు వస్తుంది. ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ రాముడి అవతారం చాలా భిన్నంగా కనిపిస్తుంది. సంభాషణలు కూడా ఏమాత్రం గ్రాంధిక ఛాయలు లేకుండా సరళమై భాషలో వినిపిస్తాయి.
గత రామాయణ చిత్రాల తరహాలోనే సీతాపహరణం, వాలి-సుగ్రీవుల యుద్ధం, రామసేతు నిర్మాణం, హనుమంతుడు సంజీవని తీసుకురావడం..చివరగా రామరావణ యుద్ధ ఘట్టాలతో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా విషయంలో దర్శకుడు ఓంరౌత్ పాత్రల మధ్య భావోద్వేగాల కంటే ఆయా ఘట్టాల్ని అత్యుత్తమ సాంకేతిక హంగులు, విజువల్స్‌తో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ైక్లెమాక్స్ ఘట్టాల్ని చూస్తుంటే హాలీవుడ్ అవెంజర్స్, సూపర్ హీరో కథాంశాల్లోని యాక్షన్ సీక్వెన్సెన్, విజువల్స్ గుర్తుకొస్తాయి. రామాయణ గాథను నేటి తరానికి ఎలా చెబితే నచ్చుతుందో అదే పంథాను అనుసరించారు దర్శకుడు. అందుకోసం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌ను వాడుకున్నారు. ఒకనాటి రామాయణ ఇతివృత్త చిత్రాల్లో వానరసేన అనగానే కోతుల తరహా గెటప్‌లో ఉన్న మనుషులనే చూపించేవారు. కానీ ‘ఆదిపురుష్’లో మాత్రం విజువల్ ఎఫెక్ట్స్‌తో తీర్చిదిద్దిన నిజమైన వానరసేన దర్శనమిస్తుంది. అయితే గ్రాఫిక్స్ హంగులతో ప్రాధాన్యతనిచ్చే క్రమంలో సినిమాలోని భావోద్వేగాలను విస్మరించారు. సీతారాముల మధ్య వచ్చే సన్నివేశాల్లో గాఢత లోపించిందనే భానవ కలుగుతుంది. హనుమంతుడు తొలిసారి రాముడిని కలుసుకునే ఘట్టంలో కూడా అంతగా ఎమోషన్స్ పండలేదు. మొత్తంగా చూస్తే నేటి తరం అభిరుచుల్ని పరిగణనలోకి తీసుకొని దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎమోషన్స్ కంటే విజువల్ గ్రాండియర్కే పెద్దపీట వేశాడు.
నటీనటులు పర్ఫార్మెన్స్:
రాముడు శాంత స్వభావానికి, నిర్మలత్వానికి ప్రతీక. ఈ సినిమాలో కూడా రాఘవ పాత్రలో ప్రభాస్ అవే భావాల్ని పలికించారు. ఆద్యంతం ప్రశాంత వదనంతో, చక్కటి చిరునవ్వుతో దర్శనమిచ్చారు. శ్రీరాముడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. క్లెమాక్స్ ఘట్టాల్లో ఆయన సంభాషణలు చెప్పిన విధానం కూడా మెప్పిస్తుంది. ఇక జానకి పాత్రలో కృతిసనన్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కనబరచింది. తెరపై ఆమె అందంగా కనిపించింది. ప్రభాస్, కృతిసనన్ జోడీ తెరపై బాగా కుదిరింది. ఇక లంకేష్ పాత్రలో సైఫ్అలీఖాన్ అద్భుతాభినయం ప్రదర్శించారు. ముఖ్యంగా పతాకఘట్టాల్లో ఆయన నటన హైలైట్‌గా నిలిచింది. లక్ష్మణుడి పాత్రలో సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్ పరిధుల మేరకు మంచి నటనను ప్రదర్శించారు.
సాంకేతికంగా ఈ చిత్రాన్ని ఉన్నతమైన విలువలతో తెరకెక్కించారు. ఎలాంటి సెట్‌వర్క్ లేకుండా పూర్తిగా విజువల్స్ ప్రధానంగా కథను తెరపై తీసుకొచ్చారు. సీతను అపహరించే సందర్భంలో జటాయువు ప్రతిఘటన, ైక్లెమాక్స్ వార్ ఎపిసోడ్లో విజువల్స్ అబ్బురపరుస్తాయి. సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. అజయ్-అతుల్ వినసొంపైన బాణీలను అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. రామాయణాన్ని నేటి సాంకేతిక హంగులతో అధునాతనంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఓంరౌత్. అక్కడక్కడా కొన్ని లోపాలున్నా.. మొత్తంగా మాత్రం ఓ విజువల్ ట్రీట్‌లా ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 2.75/5