Renu Desai strong reply to pawan fans | రెండు దశాబ్దాల క్రితం విడుదలైన బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రేణు దేశాయ్. ఆ తర్వాత మూడేళ్లకు జానీ సినిమాతో మళ్లీ పవన్‌తో కలిసి ఆడిపాడింది. అప్పటికే వీరిద్దరూ ప్రేమలో మునిగిపోయారన్న వార్తలు ఇండస్ట్రీలో జోరందుకున్నాయి. ఎట్టకేలకు 2009లో వీరిద్దరూ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట కలిసి మూడేళ్లు కూడా ప్రయాణం చేయలేక విడాకులు తీసుకున్నారు. ఇక పవన్ మరో పెళ్లి చేసుకోగా.. రేణూ దేశాయ్ మాత్రం ఒంటిరి జీవితాన్నే అనుభవిస్తూ వస్తుంది. అయితే ఎంత మాజీ భార్య అయినా.. పవన్ ఫ్యాన్స్ రేణూ దేశాయ్‌ను వదిన అనే పిలుస్తుంటారు. అంతాలా అమెను పవన్ ఫ్యాన్స్ ఆరాధిస్తుంటారు. అయితే తాజాగా పవన్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అకీరా నా కొడుకు.. మాట్లాడే పద్దతి నేర్చుకోండి అంటూ ఫ్యాన్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం అకీరానందన్ బర్త్‌డే సందర్భంగా రేణూ దేశాయ్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. దీనిపై ఓ నెటీజన్ స్పందించి మేడమ్ ఒక్కసారైనా మా అకీరాను సరిగ్గా చూపించండి. మా అన్న కొడుకును చూడాలని మాకెంతో ఆశగా ఉంటుందని కామెంట్ చేశాడు. దీనికి రేణూ దేశాయ్ స్పందించి మీ అన్న కొడుకా? అకీరా నా అబ్బాయి. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మీరు విరాభిమానులు అయ్యిండొచ్చు. కానీ మాట్లాడే పద్దతి నేర్చుకోండి. చాలా వరకు ఇలాంటి కామెంట్స్‌ను ఇగ్నోర్ చేస్తుంటా. కానీ కొందరు హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. నా కొడుకు అకీరా బర్త్‌డే రోజున ఇలాంటి కామెంట్స్ చదవడం భాధేస్తుంది. 11ఏళ్లుగా నన్నోక విలన్లా చూస్తున్నారు. ఇదంతా చూసి నేను విసిగిపోయానని ఆ నెటీజన్కు స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది.
అయితే మరో నెటీజన్ మేడమ్ తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎవరి బిడ్డవని అడిగితే తండ్రి పేరే చెబుతారు. ఇది మా సంస్కృతి. కాబట్టి కారణం లేకుండా అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేయకండి అంటూ కామెంట్ చేశాడు. ఇక దీనిపై కూడా రేణూ దేశాయ్ తన స్టైల్లో మీకు జన్మనిచ్చిన తల్లిని అగౌరవపరచడం మీ సంస్కృతా? భారతీయ సంస్కృతిలో తల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఆమెను దేవుడితో సమానంగా చూస్తారు. కావాలంటే మీ తల్లిని ఒకసారి అడిగితెలుసుకోండి. నా పోస్ట్‌లపై తరచూ ఫ్యాన్స్‌ను కామెంట్స్ చేయొద్దని చెప్పండి. కారణం లేకుండా కామెంట్స్ చేస్తున్నారు అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్‌లు నెట్టింట దుమారం రేపుతున్నాయి.