Rashmika Deepfake Video | న్యూఢిల్లీ : సినీ నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. టెక్నాలజీ దుర్వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ తరహా వీడియోలను అడ్డుకోవటంపై కేంద్ర ఐటీ శాఖ మంగళవారం స్పందించింది. ఇలాంటి వీడియోలను అడ్డుకోవాల్సిన బాధ్యత సోషల్ మీడియా సంస్థలదేనని స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించి సోషల్ మీడియా కంపెనీలకు ఒక అడ్వయిజరీని జారీ చేసింది.కృత్రిమ మేధ (ఏఐ)తో కంటెంట్‌ను తయారుచేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న వాటిపై 24 గంటల్లోగా చర్యలు చేపట్టాలని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్..తదితర సోషల్ మీడియా సంస్థలకు సూచించింది. ఐటీ చట్టం-2000 సెక్షన్ 66-డీ కింద చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశముందని తెలిపింది.
కంప్యూటర్ సాంకేతికతను ఉపయోగించి వ్యక్తుల్ని మోసగిస్తే ఈ సెక్షన్ కింద రూ.లక్ష వరకు జరిమానా, మూడేండ్ల జైలు శిక్ష విధించే అవకాశముందని అడ్వైయిజరీలో కేంద్రం గుర్తు చేసింది. ఐటీ నిబంధనావళిలో రూల్ 3(2) (బీ)ను ఉపయోగించి తప్పుడు వీడియోలను, కంటెంట్‌ను తొలగించవచ్చునని తెలిపింది. ఫిర్యా దు అందిన 24 గంటల్లోగా మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలపై చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.
డీప్‌ఫేక్ వీడియోపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు. మార్ఫింగ్ వీడియో తననెంతో భయానికి గురిచేసిందని నటి రష్మిక మందన్నా ఆందోళన వ్యక్తం చేశారు.