సినిమా ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఫొటోలను సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారానికి వాడుకోవడం కథానాయికలకు ఇబ్బందిగా మారుతున్నది. గతంలో ఓ తమిళ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడితో కలిసి సాయిపల్లవి దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్ చేసి.. వారిద్దరికి పెళ్లయినట్లుగా ఫేక్‌న్యూస్‌ను ప్రచారం చేశారు. ఆ ఫొటోలో వారిద్దరూ మెడలో పూలదండలు వేసుకొని ఉండటంతో నిజంగానే పెళ్లయిపోయిందని అందరూ అనుకున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితే కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్‌కు ఎదురైంది. తమిళ నటుడు జయం రవితో ఆమె ‘బ్రదర్’ అనే చిత్రంలో నటిస్తున్నది.
ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ స్టిల్‌ను విడుదల చేశారు. అందులో జయం రవి, ప్రియాంక మెడలో పూలదండలు వేసుకొని ఉన్నారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక మోహన్ నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలొచ్చాయి. ఈ విషయంపై ఆమె స్పందించింది. సోషల్‌మీడియాలో వచ్చిన కథనాలు చూసి షాక్ అయ్యానని పేర్కొంది. ‘ఈ ఫొటో చూసి నిజమని నమ్మిన చాలా మంది తెలుగు ఇండస్ట్రీ మిత్రులు నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అది సినిమా స్టిల్ అని అందరితో చెప్పాల్సివచ్చింది. అసలు ఇలాంటి ఫొటో ఎందుకు రిలీజ్ చేశారని సినిమా టీమ్‌పై కోపమొచ్చింది.’ అని ప్రియాంక మోహన్ చెప్పింది.