Lakshmi Menon | కేరళలోని కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో తమిళ నటి లక్ష్మీ మీనన్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. కేరళలోని ఎర్నాకులం నార్త్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఒక రెస్టారెంట్ బార్ వద్ద లక్ష్మీ మీనన్ గ్యాంగ్‌కి, బాధితుడి స్నేహితుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత, నటి లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు బాధితుడిని వెంబడించి, అతడి కారును అడ్డగించారు. ఆ తర్వాత అతడిని బలవంతంగా తమ కారులోకి లాక్కొని దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో మిథున్, అనీష్, సోనామోల్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నటి లక్ష్మీ మీనన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
లక్ష్మీ మీనన్ ప్రధానంగా తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించింది. ఆమె నటించిన చిత్రాలలో కుమ్కి (Kumki), సుందరపాండియన్ (Sundarapandian), జిగర్తాండ (Jigarthanda), వేదాలం (Vedalam), చంద్రముఖి 2 (Chandramukhi 2) వంటి తదితర చిత్రలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. విశాల్ నటించిన ఇంద్రుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది.