పెళ్లి అనేది భావోద్వేగాలతో నిండివుండే ఘట్టం. అందునా ప్రేమ వివాహమంటే ఇక చెప్పేదేముంది. గుండె నిండా ఆనందమే. కళ్లనిండా సంతోషమే. అది జీవితాన్నే జయించినంత సంబరమవుతుంది. తన జీవితంలోని ఆ మధుర క్షణాలని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నది అందాలరాశి కీర్తి సురేశ్. 2024లో ఆంటోనీ తటిల్ని తను ప్రేమవివాహం చేసుకున్న విషయం విదితమే. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, తన వివాహం అంత ఘనంగా జరుగుతుందని తాను అనుకోలేదంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్. ‘మేం కచ్చితంగా పారిపోయి పెళ్లి చేసుకుంటామనే అనుకున్నా.
కానీ ఇరు కుటుంబాల సమక్షంలో కలలో కూడా జరగనంత వైభవంగా జరిగింది మా పెళ్లి. 15ఏళ్లు మేం ప్రేమలో ఉన్నాం. పెళ్లి విషయంలో ఎన్నో కలలు కన్నాం. ఆ కలలు నిజమైన క్షణంలో భావోద్వేగానికి లోనయ్యాను. ఒక్కక్షణం నా నోట మాట రాలేదు. ఆ 30 సెకన్ల తాళి కట్టే సమయంలో 15ఏళ్ల మా ప్రేమ కళ్ల ముందు కదలాడింది. ఆనందభాష్పాలు ఆగలేదు. ఆంటోనీ కూడా ఎమోషనల్ అయ్యాడు. తొలిసారి తన కళ్లలో కూడా నీళ్లు చూశాను. నిజంగా మా జీవితంలోనే ఆనందమై న క్షణాలవి’ అంటూ గుర్తు చేసుకున్నది కీర్తి సురేశ్.