Actress | తల్లీ కానీ తండ్రి కానీ, మళ్లీ పెళ్లి చేసుకుంటానంటే… పిల్లలు అంగీకరించకపోవడం సహజం. అయితే, మలయాళ నటి ఆర్య విషయంలో మాత్రం అంతా భిన్నంగా జరిగింది. ఆమె రెండో పెళ్లికి తోడుగా నిలిచింది ఆమె 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్ ఖుషి . తల్లిని స్వయంగా వివాహ మండపానికి తీసుకెళ్లిన రోయా, మూడు ముళ్ల వేళ తల్లి ముఖంలో మెరుపులు చూస్తూ, తానూ అదే స్థాయిలో ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. ఈ అద్భుత దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ యాంకర్, నటి గా మలయాళంలో పేరు తెచ్చుకున్న ఆర్య, నటుడు మరియు కొరియోగ్రాఫర్ అయిన సిబిన్ బెంజమిన్ ను వివాహం చేసుకున్నారు.
ఇది ఇద్దరికీ రెండో వివాహం. ఈ ఏడాది మేలో నిశ్చితార్థం జరగగా, ఇటీవల కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిపారు. వివాహ వేడుకలో ఆర్య కుమార్తె రోయా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లి దృశ్యాల్లో ఆమె తల్లికి అందించిన సహకారం, అందరి హృదయాన్ని తాకేలా చేసింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. ప్రియమణి, పూర్ణ, అశ్వతి శ్రీకాంత్, అర్చన సుశీలన్ తదితరులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్య ..కుంజిరమయనం, పవ, ఉల్టా, మెప్పడియాన్, క్వీన్ ఎలిజబెత్ వంటి మలయాళ హిట్ సినిమాల్లో నటించింది. టీవీ యాంకర్‌గా కూడా మంచి గుర్తింపు పొందింది.
మలయాళ బిగ్‌బాస్ సీజన్ 2 లో కూడా పాల్గొంది. ఆమె మొదటి భర్త ఐటీ ఇంజినీర్ రోహిత్ సుశీలన్ , ప్రముఖ నటి అర్చన సోదరుడు. వీరికి రోయ అనే కుమార్తె ఉంది. అయితే, 2019లో విడాకులు తీసుకున్నట్లు ఆర్య ప్రకటించింది. ఇక సిబిన్ బెంజమిన్ విషయానికి వస్తే.. మలయాళ బిగ్‌బాస్ సీజన్ 6 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన డీజే, కొరియోగ్రాఫర్. ఇతనికీ గతంలో పెళ్లి కాగా, పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు ఆర్య, సిబిన్ కొత్త జీవితం ప్రారంభించారు.