Actress Anjali | నటి అంజలి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మరో వైపు హీరోయిన్గా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొన్ని రోజులుగా అంజలికి ఇది వరకే పెళ్లి అయిపోయిందని, అంజలి భర్త అమెరికాలో ఉంటున్నాడని పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా అంజలి ఈ వార్తలపై స్పందిస్తూ.. వాటిలో నిజం లేదని, ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని వెల్లడించింది. అయితే పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటానని, సమయం వచ్చినప్పుడు అందరికీ తప్పకుండా చెబుతానని పేర్కొంది. దీంతో అంజలి పెళ్ళి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
అంజలి.. పేరుకు తెలుగు నటినే అయిన తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఫోటో సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంజలి.. ఆ తర్వాత టాలీవుడ్లో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌కు మకాం మార్చింది. కట్రదు తమిజా సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే సూపర్ సక్సెస్ తెచ్చిపెట్టింది. ఇక దాంతో వరుసగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చింది. మళ్ళీ ఏడేళ్లకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా మారింది. ప్రస్తుతం ఈమె రామ్‌చరణ్ ఆర్సీ15లో కీలకపాత్ర పోషిస్తుంది.