Actor Vishal | పలు యాక్షన్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్. ఈ హీరోకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కూడా విశాల్‌కు మంచి క్రేజ్ ఉంది. పందెం కోడి, చక్రం తదితర చిత్రాల్లో నటించి ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. తాజాగా ఈ నటుడు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేస్తానని తెలిపారు.
విశాల్.. మక్కల్ నల ఇక్కమ్ ఛారిటబుల్ ట్రస్టును స్థాపించి.. సంస్థ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఆ సంస్థ 11 పేద జంటలకు పెళ్లి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ తన పెళ్లిపై స్పందించారు. ‘ప్రస్తుతం యాక్టర్స్ యూనియన్ బిల్డింగ్ కడుతున్నా. మూడేళ్లలో దాని నిర్మాణం పూర్తవుతుంది. ఆ వెంటనే పెళ్లి చేసుకుంటా. ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేస్తా’ అని చెప్పుకొచ్చారు. విశాల్ గతంలో కూడా తన పెళ్లి వార్తలపై మాట్లాడారు. ‘నాకు పెద్దలు కుదిర్చిన వివాహం సెట్ కాదు. ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఉంది. ప్రస్తుతం ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాను. త్వరలోనే ఆమెను పరిచయం చేస్తాను’ అని తెలిపారు.