‘తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాలనే విషయంలో నాకు సూర్యనే స్ఫూర్తినిచ్చారు. ‘గజిని’ టైమ్ నుంచి సూర్య ఇక్కడికి వస్తూ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు. సూర్య తరహాలో మనం కూడా తమిళంలోకి వెళ్లాలని, అక్కడి ఆడియెన్స్ ఆదరణ పొందాలని నిర్మాతలతో చెబుతుండేవాడిని. ఈ విషయంలో సూర్యను ఓ కేస్ స్టడీలా తీసుకోవచ్చు’ అన్నారు అగ్ర దర్శకుడు రాజమౌళి. గురువారం జరిగిన ‘కంగువ’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ “బాహుబలి’ వంటి పాన్ ఇండియా సినిమా తీయడానికి సూర్యనే నాకు స్ఫూర్తిగా నిలిచాడు. మేమిద్దరం కలిసి ఓ సినిమా చేద్దామనుకున్నాం. కానీ అనుకోని కారణాల వల్ల మిస్ అయింది. ‘కంగువా’ మేకింగ్ వీడియో చూస్తుంటే టీమ్ అంతా ఎంత కష్టపడ్డారో అర్థమవుతున్నది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్’ అన్నారు. సూర్య మాట్లాడుతూ ‘దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చాం.
ఈ కథ విన్నప్పుడు ఎంతగానో ఎక్సైట్ అయ్యాను. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. నా గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుదని నమ్ముతున్నా’ అన్నారు. దర్శకుడు శివ మాట్లాడుతూ ‘వెయ్యేళ్ల వ్యవధిలో ఐదు తెగలు, వారి మధ్య ఉండే ప్రేమ, సంఘర్షణ, పోరాటాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. లార్జర్ దేన్ లైఫ్ మూవీగా సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది’ అన్నారు. హీరో సూర్య తెలుగు ఇంటి కుటుంబ సభ్యుడిలా మారిపోయారని దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, హీరోలు విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు.