కరోనా కాలం మొదలైనప్పటి నుండి మనం ఎన్నో విషాదాలు వింటున్నాం. సామాన్యులు, సెలబ్రిటీలు తనువు చాలిస్తున్నారు. ఒకరి మరణవార్త మరచిపోకముందే మరొకరి మరణ వార్త గురించి వినాల్సి వస్తుంది. ప్రముఖులు,వారి కుటుంబ సభ్యులు హఠాన్మరణం చెందుతుండడంతో అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
అయితే శాండల్‌వుడ్ సీనియర్ నటుడు సత్యజిత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారింది. ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బీపీ, షుగర్ ఉన్న కారణంగా చికిత్సకు స్పందించడం లేదని తనయుడు ఆకాశ్‌జిత్ తెలిపారు. చికిత్స ఖర్చులకు ఫిలిం చాంబర్, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కొద్దిరోజుల క్రితం కామెర్లు సోకడంతో పాటు గత శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారినట్టు తెలుస్తుంది. త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు.