Rukmini Vasanth | కన్నడ నటి రుక్మిణి వసంత్‌కు సంబంధించిన ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేశారనే ఆరోపణలపై బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి ‘కాంతార: చాప్టర్ 1’ నటి మార్ఫ్ చేసిన విజువల్స్ క్రియేట్ చేశారని, ఆమె పరువుకు భంగం కలిగించే ఉద్దేశంతో వాటిని ఆన్లైన్లో షేర్ చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ సందర్భంగా మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసుపై వివరమైన దర్యాప్తు ప్రారంభించారు.
ఏఐ జనరేటెడ్ బికినీ ఫొటోలు వైరల్ అయిన తర్వాత నటి రుక్మిణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైరల్ అవుతున్న విజువల్స్ పూర్తిగా ఫేక్ అని, వాస్తవం కాదని స్పష్టం చేసిన ఆమె, టెక్నాలజీ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను చాకచాక్యంగా పట్టుకున్నారు. ఇక తాజాగా నిందితులను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, దర్యాప్తు కొనసాగుతున్నందున కస్టడీకి రిమాండ్ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మార్ఫ్ చేసిన కంటెంట్ క్రియేషన్, సర్క్యులేషన్లో మరికొందరు వ్యక్తులు ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.