Kantara: Chapter 1 | కన్నడ నటుడు రిషబ్ షెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కాంతార చాప్టర్1కి వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్‌లు ప్రయాణిస్తున్న వ్యాన్‌కు ప్రమాదం చోటు చేసుకోగా.. ఆ తర్వాత కొన్నిరోజులకే కపిల్ అనే నటుడు నదిలో కొట్టుకుపోయి చనిపోయాడు. మరోవైపు అదే నెలలో రాకేశ్ పూజారి అనే మరో నటుడు గుండెపోటుతో కన్నుమూయగా.. నిన్న శనివారం రోజున కాంతారలో నటిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ (43) సైతం గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఈ సంఘటనలు మరవకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో నటుడు రిషభ్ షెట్టి కూడా ఉండడం విశేషం.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతుండగా.. ఈ షూటింగ్లో పాల్గోన్న నటుడు రిషభ్షెట్టితో పాటు 30 మంది ఆర్టిస్ట్‌లు కలిసి ప్రయాణిస్తున్న బోట్ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో వెంటనే వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో కెమెరాతో పాటు సాంకేతిక పరికారలు కొట్టుకుపోగా.. రిషభ్‌తో పాటు పలువురు నటులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.