Ram Kapoor | ప్రముఖ టెలివిజన్, బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ తన జీవితంలో జరిగిన ఒక అత్యంత బాధాకరమైన నిజాన్ని బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేశారు. తాను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యానని ఆయన సంచలన ప్రకటన చేశారు. రియాలిటీ షో ‘లాక్ అప్ సీజన్ 2’ లేటెస్ట్ ఎపిసోడ్లో ఎలిమినేషన్ నుండి తనను తాను కాపాడుకునే ప్రక్రియలో భాగంగా రామ్ కపూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రహస్యం విన్న షో హోస్ట్ ఫరా ఖాన్ మిగిలిన కంటెస్టెంట్లు తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
తాను బోర్డింగ్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన ఆ భయంకరమైన సంఘటనను రామ్ కపూర్ గుర్తుచేసుకున్నారు. స్కూల్ అయిపోయిన తర్వాత ఒకరోజు అందరూ హాస్టల్ గదిలో మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో, 10వ తరగతి చదువుతున్న ఒక సీనియర్ స్టూడెంట్ తన బెడ్‌పై వచ్చి కూర్చున్నాడని ఆయన తెలిపారు. ఆ సమయంలో గదిలో దాదాపు 30 నుండి 40 మంది పిల్లలు ఉన్నప్పటికీ, అతను హఠాత్తుగా దుప్పటి కింద నుండి తనను తప్పుగా తాకడం మొదలుపెట్టాడని చెప్పారు. ఆ క్షణంలో తాను పూర్తిగా స్తంభించిపోయానని, ఏం చేయాలో లేదా ఎలా స్పందించాలో అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాసేపటి తర్వాత ధైర్యం తెచ్చుకుని, తనకు ఇది నచ్చడం లేదని గట్టిగా చెప్పడంతో ఆ సీనియర్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడని రామ్ కపూర్ వివరించారు.
ఈ సంఘటన తర్వాత తాను తీవ్రమైన మానసిక గాయానికి గురయ్యానని, చాలా సైలెంట్‌గా మారిపోయానని ఆయన చెప్పారు. అయితే కొన్ని వారాల తర్వాత ఆ సీనియర్ స్టూడెంట్ స్వయంగా వచ్చి తనకు క్షమాపణలు చెప్పాడని, ఆ తర్వాత కూడా ఎప్పుడు అవకాశం దొరికినా తప్పు తెలుసుకుని బాధపడేవాడని వెల్లడించారు. నన్ను ఆ బాధలోకి నెట్టిన వ్యక్తే, విచిత్రంగా నేను ఆ మానసిక వేదన నుండి బయటపడటానికి కూడా సహాయం చేశాడని, ఆ తర్వాత తామిద్దరం మంచి స్నేహితులమయ్యామని రామ్ తెలిపారు. ఈ విషయాన్ని గత 40 ఏళ్లుగా రహస్యంగా ఉంచానని, తన తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ ఈ విషయం తెలియదని, కేవలం తన భార్య గౌతమి కపూర్‌కు మాత్రమే తెలుసని స్పష్టం చేశారు. ఆ సీనియర్ చేసిన పని కేవలం హార్మోన్ల ప్రభావం మరియు టీనేజ్ ఉత్సుకత వల్ల జరిగి ఉండవచ్చని, అతను చెడ్డవాడు కాదని చెప్తూ, భవిష్యత్తులో ఇలాంటి చేదు అనుభవం ఏ బిడ్డకూ రాకూడదని రామ్ కపూర్ ఆకాంక్షించారు.